Tuesday, January 18, 2011

మానవత్వం

మనుష్యులు మానవత్వాన్ని, దేవతలు దైవత్వాన్ని, రాక్షసులు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తారని - అది వారి నైజమని మనకందరకూ తెలుసును. కొంచం దుర్మార్గంగా ఉన్నవారిని రాక్షసులతోనూ, ప్రేమా, కరుణ ఎక్కువగా నిండినవారిని దైవంతొనూ పోల్చుకుని మనం వ్యవహరిస్తూంటాం. ఒక్కోసారి మనుషులు "మానవత్వాన్ని" అంటే మనిషియొక్క సహజగుణాన్ని మరిచిపోయి ఫ్రవర్తిస్తూ ఉన్నారని అంటూ, అనుకుంటూ ఉంటాం. మనకి ఒక దెబ్బ తగలగానే అమ్మా! అనే ఆర్తనాదం ఎంత సహజమో, సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు అంతేసహజంగా స్పందిస్తే మానవత్వం, మనుషుల్లో ఉంది అనేగా అర్ధం. ఉదా:- ఒక రోడ్డుమీద ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి. వెంటనే ఉరకలు పరుగుల్లో ఉన్న మనుషులంతా ఠక్కున ఆగి చూస్తారు. కొందరు వారికి ఆపన్నహస్తం అందిస్తారు. మరి కొందరు సహయచర్యలు చేపడతారు. ఇంకొందరు పెద్దప్రమాదం తప్పిందని ఆ భగవంతునికి ప్రణామాలు అర్పిస్తారు. ఇదంతా నేటికీ మనుష్యుల్లొ మానవత్వం ఉందని రుజువు చేసే సంఘటనలే కదా! ఇటీవల నాకెదురైన సంఘటనల్లొ మన చుట్టూ ఉన్న మానవతా విలువల పట్ల నా స్పందన కవితా రూపంలో.


ఆహ్లాదకరమైన వాతావరణం
సాఫిగా సాగే వాహన ప్రయాణం
అంతలోనే చిన్న దుర్ఘటన
మన చేతుల్లో ఏది లేదనే ఘటన
అదుపు తప్పిన నాలుగు చక్రాలు
పల్టీలు కొట్టడమే నిదర్శనం
భగవంతుడా! ఇపుడెలా?
ప్రశ్న? నా అంతరంగంలోంచీ-
సమాధానంగా నా చుట్టూ...
నర రూపంలోని నారాయణులు అనేకులు
చక.. చకా.. రక్షణ చర్యలు..
టక టకా ....స్వాంతనవచనాలు
బిర.. బిరా ...చుట్టూ...
పరచుకున్న మానవత్వం
అందరిలో ఒకటే ఆశ్చర్యం!
అందరినోటా ఒకటే మాట -
దెబ్బలు తగల్లేదు కదా
అదృష్టవంతులు మీరు
దైవం మిమ్మల్ని కాపాడాడు
- ఏవేవో అంటున్నారు అనుకుంటున్నారు

నిజమే!
నాడు ప్రహల్లాదుని
కొండలపై నుండీ లోయల్లో పడినప్పుడు
రక్షించిన ఆ చక్రధారి
ఇపుడు నా రక్షకుడై వున్నాడు మరి.

4 comments:

  1. వహ్ వహ్ ...... మానవుడు మహనీయుడు అని బాగా చెప్పారు.
    దైవ హస్తం ఎల్లపుడు మానవుడి చెంత ఉంటుంది.
    మీ కవిత అద్బుతం....కళ్ళకు కట్టినట్లు చెప్పారు..
    దైవం మనవ రూపేన అన్నది నిజం.

    ReplyDelete
  2. నిజం...బాగారాసారు

    ReplyDelete
  3. బావుందండి మీ భావ వ్యక్తీకరణ.. ఇటువంటి సంఘటనలను అందరూ మమూలు పదాలలో సంభాషించుకోవడం పరిపాటి. కానీ మీరు చక చకా కొంతవరకు ప్రాస కుదిరేలా ఆసువుగా ఒక కవితను అల్లేసి వ్యక్తపరిచారు..

    మానవత్వం బొత్తిగాలేని వాళ్ళు జీవచ్చవాలేనేమో .. మానవత్వం పరిమళించే సంఘటనలు స్పూర్తినిస్తాయి. కాని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించవలసిన నియమాలు గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు (లేదా కొంచెం తీవ్రతరమైనవి జరిగినప్పుడు) పాటించవలసిన నియమ నిబంధనలు ఏమైనా తెలియజేస్తే తెలుసుకుందామని ఉంది.. వీలైతే అందించే ప్రయత్నం చెయ్యమని మనవి.

    ReplyDelete
  4. క్రమశిక్షణారహిత్యం వల్ల, భాద్యతారహిత్యం వల్లా మనుషుల్లొ స్పందన తగ్గుతూంది. దుర్మార్గం రోజు రోజుకి పెరుగుతున్న ఈరోజుల్లొ మంచితనం-మానవత్వం గురించి మాటలాడేవారు, వినేవారు తక్కువ. అందుకే మంచితనం మనుషుల్లొ గుర్తించినపుడు మన్సుకి ఒక విధమైన సంతొషం. అందుకే మహత్మా గాంధి ఎప్పుడొ చెప్పారు "మంచిగా నిజాయితిగా ఉన్నవారిని పొగడవలసిన/గుర్తించవలసిన కాలం వచ్చింది ఎందుకంటే మంచితనం రొజురొజుకీ కనుమరుగవుతూంది కాబట్టి."

    ReplyDelete